

అయోధ్య రామమందిరంలో గత 40 రోజుల్లో వరుస చోరీలు, విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా సాగేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఆదేశించింది. అలాగే దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్‌కు గడువు విధించింది.
ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు వేగంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ఆలయ విరాళాల వివరాలను అధికారిక వెబ్సైట్లో వెల్లడించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరినా, ప్రస్తుతం దర్యాప్తు పూర్తిచేయడంపైనే ప్రధాన దృష్టి ఉందని పేర్కొన్న సుప్రీంకోర్టు ఆ అంశంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సిట్ నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!