

‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి, తన కొత్త చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంతో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా టాలీవుడ్లోకి పరిచయం అవుతుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరపై అడుగుపెడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 30న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అజయ్ భూపతి తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మంగళవారం’ సీక్వెల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘మంగళవారం’ సినిమాకు తమిళ, మలయాళ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ప్రశంసలు తనకు ఎంతో ఆనందం కలిగించాయని తెలిపారు. సీక్వెల్‌ను మరింత నాణ్యతతో రూపొందించేందుకు సమయం తీసుకుంటున్నానని చెప్పారు. ‘మంగళవారం 2’లో కొత్త పాత్రలు, కొత్త సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని వెల్లడించారు. ఇది సినిమాటిక్ యూనివర్స్ కాదని, సీక్వెల్లో ప్రత్యేకమైన సీక్రెట్ పాత్రలు ఉంటాయని స్పష్టం చేశారు. మొదటి భాగంలోనే పార్ట్-2కి సంబంధించిన హింట్ ఇచ్చానని, ఈసారి మరింత ఉన్నత స్థాయిలో సినిమా తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!