

భారతీయ సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు, రచయితల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని హీరోయిన్ మాళవిక మోహనన్ అభిప్రాయపడ్డారు. ప్రముఖ ‘వెరైటీ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మహిళా సృజనకర్తలు తక్కువగా ఉండటం వల్ల ప్రధాన స్రవంతి సినిమాల్లో మహిళా పాత్రలు ఒకే తరహాలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళల దృష్టికోణం నుంచి చెప్పబడే కథలు మరింత పెరిగితే ప్రేక్షకులకు కొత్త తరహా పాత్రలు, వైవిధ్యమైన కథనాలు అందుతాయని ఆమె అన్నారు. మహిళా దర్శకులు ఎక్కువైతే యాక్షన్ కథల్లోనూ మహిళలకు బలమైన పాత్రలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.
భారతీయ చిత్రసీమలో ‘కిల్ బిల్’ తరహా శక్తివంతమైన మహిళా ప్రధాన కథలు రావాలంటే మహిళా రచయితలు, దర్శకులు ముందుకు రావాలని మాళవిక సూచించారు. ఇదే సందర్భంగా అమీర్ ఖాన్ నిర్మించిన ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, అందులో మహిళా పాత్రలను ఆవిష్కరించిన తీరు తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. భవిష్యత్తులో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. మంచి కథ, బలమైన పాత్ర ఉంటే అలాంటి అవకాశాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!