

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలని పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జనసైనికులు, వీర మహిళలు గతంలో ఎదుర్కొన్న ఒత్తిళ్లు, దాడులను లెక్కచేయకుండా పోరాడిన స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు సాగాలని సూచించారు. గురువారం శాసనసభ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై ఆయన చర్చించారు.
స్థానిక ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల వ్యూహానికి భిన్నంగా ఉంటాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా రాజకీయ, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జనసేన పోటీ చేయాల్సిన స్థానాలను గుర్తించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల విధివిధానాలను రూపొందించేందుకు 9 నుంచి 11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీకి తగిన ప్రాధాన్యం లభించని ప్రాంతాల్లో శ్రేణులకు మెరుగైన రాజకీయ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!