

ఎయిర్ ఇండియా గ్రూప్ రానున్న 18 నెలల్లో 50 నుంచి 60 కొత్త విమానాలను అందుకోనుంది. ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చైర్మన్ నిపుణ్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన ధరల అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి సవాళ్లు ఎదురైనా సంస్థ పరివర్తన ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా గ్రూప్ వద్ద 290కి పైగా విమానాలు ఉన్నాయి.
సంస్థ దాదాపు 600 విమానాలకు ఆర్డర్లు ఇచ్చినా ఇప్పటివరకు 10 శాతం కన్నా తక్కువ విమానాలే డెలివరీ అయ్యాయని తెలిపారు. మిగతా విమానాలు దశలవారీగా వచ్చే సంవత్సరాల్లో అందనున్నాయి. ప్రతి ఏడాది 10 నుంచి 15 వైడ్‌బాడీ, 45 నుంచి 50 న్యారోబాడీ విమానాలు చేరనున్నాయని చెప్పారు. అలాగే వచ్చే మార్చి నాటికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రెట్రోఫిటింగ్ పూర్తవుతుందని వెల్లడించారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా తగ్గించిన అంతర్జాతీయ సేవలను ఇప్పుడు తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే మధ్యప్రాచ్య ప్రాంతంలో 90 శాతం సర్వీసులు పునరుద్ధరించామని, యూరప్, అమెరికా మార్గాల్లో బుకింగ్స్ పెరుగుతున్నాయని చెప్పారు. మరో రెండు నెలల్లో యుద్ధానికి ముందున్న స్థాయికి సేవలు చేరుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!