

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి షాలినీ పాండే, తనపై వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఆ వీడియో పూర్తిగా కల్పితమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన నకిలీ వీడియో అని స్పష్టం చేశారు. అందులో కనిపిస్తున్నది తాను కాదని పేర్కొంటూ, సాంకేతికతను దుర్వినియోగం చేసి వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఒక రకమైన వేధింపుగా పరిగణించాలని ఆమె అన్నారు.
ఆ నకిలీ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని, ఇతరులకు పంపవద్దని లేదా డౌన్‌లోడ్ చేయవద్దని షాలినీ పాండే విజ్ఞప్తి చేశారు. దాని వ్యాప్తిని అరికట్టేందుకు వెంటనే రిపోర్ట్ చేసి బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇటీవల కాలంలో డీప్‌ఫేక్ వీడియోల బారిన పడుతున్న సినీ ప్రముఖుల జాబితాలో ఆమె కూడా చేరారు. ‘అర్జున్ రెడ్డి’, ‘మహానటి’, ‘జయేష్‌భాయ్ జోర్దార్’, ‘మహారాజ్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన షాలినీ, నకిలీ కంటెంట్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!