

సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు కొన్ని వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే ఇటీవలి కాలంలో ఓటీటీలో ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌లలోని పాత్రలను తీసుకుని కొత్త కథలతో సినిమాలు రూపొందించి థియేటర్లలో విడుదల చేసే ట్రెండ్ కూడా కనిపిస్తోంది. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ ఇందుకు తాజా ఉదాహరణలు. అయితే ఓటీటీలో ఆయా సిరీస్‌లు, పాత్రలకు వచ్చిన క్రేజ్‌కు థియేటర్లలో ఈ సినిమాలకు దక్కిన స్పందనకు పెద్దగా సంబంధం లేకుండా పోయింది. దీంతో అసలు తేడా ఎక్కడ వచ్చిందనే చర్చ మొదలైంది.
‘మీర్జాపుర్’ సిరీస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ సిరీస్‌లోని మున్నా భయ్యా, కాలీన్ భయ్యా, గుడ్డు భయ్యా, బబ్లూ భయ్యా వంటి పాత్రలు ప్రేక్షకుల్లో బలంగా రిజిస్టర్ అయ్యాయి. అయితే సినిమాగా వచ్చినప్పుడు ఆ పాత్రలను మాత్రమే తీసుకుని కొత్త పాత్రలు, కొత్త కథనంతో తెరకెక్కించారు. సిరీస్‌లో ఉన్నంత ఉత్కంఠ, హై మూమెంట్స్ లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ‘ఎపిక్’ విషయానికి వస్తే, తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిన #90స్ వెబ్ సిరీస్‌లోని ఆదిత్య పాత్రను ఆధారంగా చేసుకుని సినిమా రూపొందించారు. అతను పెరిగి పెద్దయ్యాక విదేశాలకు వెళ్లి అక్కడ ఓ తెలుగు అమ్మాయితో ప్రేమలో పడే కథను చూపించారు. ట్రైలర్, పాటలు ఆసక్తి కలిగించినప్పటికీ, కథలోని చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు రిలేటబుల్‌గా అనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిరీస్‌లో తమకు దగ్గరగా అనిపించిన పాత్రను సినిమాలో అదే స్థాయిలో కనెక్ట్ చేయలేకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారింది. ఓటీటీ క్రేజ్‌ను మాత్రమే నమ్మకుండా, థియేటర్ ప్రేక్షకులకు సరిపోయే బలమైన, సహజమైన కథనంతో రావాల్సిన అవసరాన్ని ఈ రెండు సినిమాలు చర్చకు తీసుకొచ్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!