

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ఓటర్లను "అన్‌కలెక్టబుల్" కేటగిరీ కింద గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ పత్రాలను 100 శాతం పంపిణీ చేసినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నప్పటికీ, గురువారం సాయంత్రం వరకు మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో 2,59,50,506 మంది (76.72%) వివరాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ పూర్తికాకముందే అన్‌కలెక్టబుల్ పేరుతో ఓటర్ల పేర్ల తొలగింపుపై ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఎన్నికల సంఘం ప్రకారం ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ (ఏఎస్‌డీ) కేటగిరీకి చెందిన ఓటర్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. రెండు వారాల క్రితం 13 లక్షలుగా ఉన్న అన్‌కలెక్టబుల్ ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 40 లక్షలకు చేరినట్లు సమాచారం. మంచిర్యాల, కరీంనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, వరంగల్ పశ్చిమ తదితర నియోజకవర్గాల్లో 20 శాతానికి పైగా ఓటర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలామందికి ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదని, పంపిణీ కాని పత్రాలను కూడా అన్‌కలెక్టబుల్‌గా పరిగణిస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అలాగే పూర్తి ధృవీకరణ లేకుండానే బూత్ లెవల్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!