

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి భాష ఎప్పుడూ వినలేదని సీఎం చెప్పారని, అయితే ఇన్నేళ్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, ఉపయోగించిన పదజాలాన్ని తెలంగాణ సమాజం మొత్తం చూసిందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని, సీఎం హోదాలో శాసనసభ్యులను అవమానించారని ఆరోపించారు.
అసెంబ్లీలో మహిళా జర్నలిస్టులపై కూడా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కత్తులతో నరికేస్తామని హెచ్చరించిన సందర్భాలున్నాయని అన్నారు. తనపై ఎథిక్స్ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని, కానీ ఇతరులు పదవుల్లో ఉన్నప్పుడు ఎథిక్స్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కూడా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ ఇది ప్రభుత్వం కాదు, సర్కస్ అని పలుమార్లు రుజువైందని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి మగ పోలీసులను, పురుష ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి మహిళా పోలీసులను వినియోగించారని అన్నారు. పురుష ఎమ్మెల్యేలను మహిళా పోలీసులు నెట్టి దాడి చేశారని, మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. మహిళా పోలీసు అధికారి శిల్పవల్లి తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను జుట్టు, చీర పట్టుకుని లాగడం వంటి చర్యలు అవమానకరమని, ఇది పద్ధతి కాదని కౌశిక్ రెడ్డి అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!