

నీట్ వ్యతిరేక నిరసనల సందర్భంగా జరిగిన అరెస్టుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. నిరసనల్లో అరెస్టైన 18 ఏళ్లలోపు విద్యార్థులు మరియు నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు కొనసాగవచ్చని స్పష్టం చేస్తూనే, అర్హులైన విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. అయితే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ ఉపశమనం వర్తించదని పేర్కొంది.
శాంతియుత నిరసనల సందర్భంగా పోలీసుల బలప్రయోగంపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థులు, మహిళలు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు గాయపడినట్లు వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనల నిర్వహణకు ఏకరీతి మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, సీసీటీవీ ఫుటేజ్‌లు మరియు డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!